Posted on జనవరి 26, 2010 by స్నేహ
మనం నిలబడ్డ క్యూలో ఒక తల్లి ఏడుస్తున్న చిన్న పిల్లవాడితో నిలబడి వుంది. తన కంటే ముందు నిలబడ్డ వాళ్ళ సహాయం అడిగితే లేదు నిన్ను ముందుకు పంపిచలేము మాకు ఆలస్యం అవుతుంది అన్న సమాధానం ఎదురవుతుంది.
కిక్కిరిసిన బస్సులో నిద్రపోతున్న చిన్న పాపను ఒక చేతిలో పట్టుకొని నిలబడిన ఒక తల్లిని చూసి, ఆమె వంక చూస్తే మన సీటు అడుగుతుందేమో అని తలతిప్పుకునే చదువుకున్న అమ్మయిలు ఎదురైతారు.
పక్కింటిలోని అదేపనిగా ఏడుస్తున్న చిన్న పిల్లలను చూసి విషయం ఏమిటో కనుక్కోవడం అటుంచి విసుక్కునే వాళ్ళు కనపడతారు.
ఆత్మీయులు ఇంటికి వస్తే వాళ్ళు ఉన్నంత సేపు వాళ్ళ పిల్లలు మన ఇంటిలో ఉన్న ఖరీదైన సోఫా, టివి మొదలైన సామాగ్రి పాడుచేస్తారేమో అన్న అనుమానంతో ఇంటికి వచ్చిన అతిథులను అభిమానంగా పలకరించడమే మర్చిపోతాం.
ఎందుకిలా? సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న మహాకవి మాటలు మర్చిపోయామా? మనము మన సుఖాలు తప్పఇతరుల గురించి మాకెందుకు అన్నట్టు తయారవుతున్నాం ఎందుకు? ఇళ్ళు విశాలంగా అవుతున్న కొద్దీ , హృదయం ఇరుకుగా అవుతున్నట్టుంది ఎందుకు?ఎందుకింత మెటీరియలిస్టిక్ గా తయారవుతున్నాం.
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 4 వ్యాఖ్యానాలు »
Posted on జనవరి 26, 2010 by స్నేహ
శాస్త్ర విజ్ఞానం బ్లాగులో పిల్లలు విద్యావిధానంలో సృజనాత్మకమైన స్వేచ్ఛ గురించి చదివినపుడు మా అబ్బాయి చదువు విషయం గుర్తు వచ్చింది.
మా అబ్బాయి ఈ మధ్య తెలుగు చదవడం నేర్చుకుంటున్నాడు.వాడికి చదువు నేర్పుతున్నపుడు చదువు నేర్పే విధానం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకునే ప్రయత్నమే ఈ టపా.
పిల్లలకు ఇష్టం లేకుండా బలవంతంగా నేర్పే విధానానికి నేను పూర్తి వ్యతిరేకం. మా వాడు రోజూ మేము చదువుతున్నపుడు ఈనాడు పేపర్ని బాగ గమనించేవాడు. కొన్ని రోజులకు అందులో ఉన్న అక్షరాల గురించి అడిగేవాడు. తరువాత ఒకరోజు అ,ఆ,ఇ.ఏ లు నేర్పమని అడిగాడు. ఇలా వాడి ఇష్టంతో నేర్చుకోవడం వల్ల చాలా ఉత్సాహంగా నేర్చుకునేవాడు. మొదటి పదం చదివిన రోజు వాడి కళ్ళలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. పిల్లల కళ్ళలో అలాంటి ఆనందం చూడడం కోసం బడిలో టీచర్‌గా చేరితే బాగుండుననిపించింది. ఇలా ఇష్టం గా నేర్పించాల్సిన చదువుల్ని బలవంతంగా రుద్ది వాళ్ళ ఆనందాన్ని మనమే పాడు చేస్తున్నాం అనిపించింది.
అన్ని బళ్ళలోనూ ఈరోజు ఇది నేర్పించాలి, రేపు ఇది అని ప్రణాళిక ప్రకారం నేర్పిస్తారు. అందరు పిల్లలు ఆ రోజు అదే నేర్చుకోవాలన్న ఇష్టంతో ఉంటారా? మరి మనం అయిష్టంగా నేర్పిస్తే వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలరు? ఇలాంటి ప్రణాళికల బదులు తరగతి గదిలో పిల్లలకు నేర్చుకొవాలి అన్న ఉత్సాహాన్ని కలిగించే వాతావరణాన్ని కలిగించి ఏమి నేర్చుకోవాలన్న నిర్ణయాన్ని పిల్లలలకే వదిలేస్తే ఎన్నొ రెట్లు ఉత్సాహంతో నేర్చుకునే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల టీచర్లకు శ్రమ అనుకుంటారేమో కానీ అది అది ఏమాత్రం నిజం కాదు. దీనికి మా బాబు తెలుగు నేర్చుకున్న విధానమే సాక్ష్యం. వాడికి తెలుగు నేర్పడానికి నేను ఏ మాత్రం శ్రమ పడలేదు.వాడికి ఇష్టమైనంత సేపు, ఇష్టమైనవి నేర్పడం ఇష్టం లేకపోతే వదిలేసేయ్యడం నేను చేసిన పని అంతే. నేర్పించడం మాత్రం ప్రణాళికా బద్దం గా నేర్పాను (పిల్లలకు తెలుగు నేర్పాలి అనుకునే వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా?”).
తల్లిదండ్రులకు పిల్లల చదువు నేర్పే విధానం మీద అవగాహన వుంటే బళ్ళలో పిల్లలకు బలవంతంగా రుద్దే విధానాన్ని ప్రశ్నించవచ్చు. అలాకాకుండా తల్లిదండ్రులే పిల్లల మీద ఇలా రుద్దుతూ వుంటే ఆ పిల్లలను దేవుడే రక్షించాలి.
: నందు ఉంచబడ్డది; పిల్లలు-చదువులు | 3 వ్యాఖ్యానాలు »
Posted on నవంబరు 28, 2009 by స్నేహ
గమనిక : ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. చాలా రోజులుగా నాలో కలుగుతున్న ఆలోచనలరూపమే ఈ టపా.
ఈ మధ్య ఎక్కడ చూసినా మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ మార్పు గురించి ఆలోచిస్తుంటే మార్పు అంటే ఏమిటి , ఎక్కడ రావాలి, మనలో రావాల్సిన మార్పా లేక పరిస్థితులలో మార్పా అన్నది అర్థం కాలేదు.
మా బాబు చిన్నవాడు వాడికి అసలు అక్షరాలు రాయడం రావడం లేదు, ఇంత చిన్నవాడి చేత అక్షరాలు రాయించడం ఏమిటి అని ఒక తల్లి ఆవేదన.వాళ్ళ బాబు వెళ్ళే బడిలో మార్పు రావాలని ఆవిడ కోరిక. వాళ్ళ బాబు చిన్నవాడు అని తెలిసినపుడు బడిలో చేర్పించకుండా ఇంట్లోనే ఉంచుకొని తనకు కావాల్సిన మార్పు కోసం ప్రయత్నిస్తే కావాల్సిన మార్పు రావచ్చు. కాని ఆవిడకి కావాల్సింది అలాంటి మార్పు కాదు తన కోసం ఎవరో మారాలి ఇది ఎలా సాధ్యం?
రాజకీయాల విషయానికి వస్తే అందరూ మార్పు కావాలని కోరుకునేవాళ్ళే.కాని ఎన్నికల రోజు రాగానే అవకాశం ఉండి ఓటు వేయకుండా ఉండేవాళ్ళు ఎందరో. మనం కోరుకునే మార్పు కోసం ఓటు వేయాలన్న మార్పు మనలో రానప్పుడు మనం కోరుకున్న మార్పు ఎలా వస్తుంది? మంచి రాజకీయ రాయకులు, జె.పి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓటు వేస్తాం అంటారా? అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన ఓటు తో పని లేకుండానే మనం కోరుకున్న మార్పు వస్తుంది.
మొన్నటికి మొన్న మైదుకూరి బడిలో జరిగిన విషయంపై వార్తాపత్రికలలో చాలా చర్చలే జరిగాయి. తెలుగుకి అవమానం అని కొందరు,తెలుగు అంతరించిపోతోందని కొందరు, ఆ పంతులమ్మని శిక్షించాలని కొందరు, ఇలా చాలామంది చాలానే చెప్పారు. తెలుగుకి అవమానం అని, తెలుగు అంతరించిపోతోందని వాదించే వాళ్ళకి బళ్ళలో ఇలాంటి శిక్షలు లేకుండా పిల్లలు తెలుగులోనే మాట్లాడే మార్పు కావాలి. మరి ఇలాంటి మార్పు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని, తెలుగు మాధ్యమంగా నడిచే పాఠశాలల్ని ప్రోత్సహించడమో చేయాలి. అలాక్కాకుండా మన పిల్లల్ని మాత్రం ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పించి, మిగతా బళ్ళలో మార్పు రావాలి అంటే ఎలా?
ఇక పంతులమ్మని శిక్షిస్తే ఇలాంటి విషయాల్లో మార్పు వస్తుందని భావించే వారు కొందరు. ఆంగ్లంలో మాట్లాడాలి అన్నది పంతులమ్మ కోరికా లేక తల్లిదండ్రుల కోరికా? మన పిల్లలు ఆంగ్లంలోనే మాట్లాడాలి,చదువులో ఎప్పుడు ఫస్ట్ రావాలి, అన్న తల్లిదండ్రుల కోరికలో మార్పు వస్తే పంతులమ్మలకు ఇలాంటి శిక్షలు వేసే అవసరమే రాదు.అలాంటి మార్పు తల్లిదండ్రులలో రానంతవరకు ఎందరు పంతులమ్మల్ని శిక్షించినా మనం కోరుకున్న మార్పు మాత్రం రాదు.
వరకట్నం లేని సమాజం రావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎందరో.మరి ఇంకా ఎందుకు వరకట్నం ఇవ్వడం తగ్గడం లేదు? కట్నం లేని సమాజం రావాలంటే కట్నం ఇవ్వడం మానేయాలి. అమ్మాయిలు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోమని గట్టిగా చెప్పగలగాలి. మనం ఇవ్వడం మానకుండా ఎవరో వచ్చి మనకు కావాల్సిన మార్పు తీసుకు రావాలి అంటే ఎలా?
దేవాలయాల్లో వి.ఐ.పి లకు ప్రత్యేక ప్రవేశం ఎందుకు? ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని కొందరి బాధ.ఇలాంటి మార్పు రావాలి అని ఒకపక్క కోరుకుంటూనే మరోపక్క తొందరగా దర్శనం జరుగుతుంది అని ప్రత్యేక దర్శనానికి వెళ్ళడం ఎందుకు? మనమొక్కరమే మామూలు దర్శనంకి వెళ్తే కావల్సిన మార్పు వచ్చేస్తుందా అంటారా? రాదు. కాని మనకు కావాల్సిన మార్పు కోసం మనం కనీసం ప్రయత్నం అయినా చేయాలి కదా?
మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పు రావాలి అంటే ముందు మనలో మార్పు రావాలి.ఏమంటారు?
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 1 అభిప్రాయం »
Posted on జులై 11, 2009 by స్నేహ
ఈరోజు ఈనాడు చెన్నై లోకల్ పేపర్లో రెహమాన్ గారిని ఉద్దేశించి రాసిన వార్తలో “మద్రాస్ మొజార్ట్” అని రాసారు.ఇది చదవగానే మనకు సొంత ఆలోచనలు ఉండవా? ఎప్పుడూ ఇలా విదేశాల్లోని ప్రముఖ వ్యక్తులతో మనవాళ్ళను పోల్చి ఎందుకు మనల్ని మనం కించపరుచుకుంటాం అనిపించింది. ఇలా పిలవడం నాకైతే ఆయా వ్యక్తులని అవమానించినట్లే అనిపిస్తుంది. “మద్రాస్ మొజార్ట్” అనిపిలవడం వల్ల రెహమాన్ గారి ప్రతిభకు మొజార్ట్ అనే ఆయనను కొలబద్దగా తీసుకునట్లు అనిపించింది. ఇలాంటి వాతలు పెట్టుకోవడం జనాలకు మీడియా నేర్పిందో లేక జనాల నుండి నేర్చుకుందో మరి.మరీ వింతగా అనిపించేది హాలీవుడ్ ని అనుకరిస్తూ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ (ఇది చెన్నై వచ్చాక ఈనాడు లోకల్ పేపర్ చదివినపుడే తెలిసింది అంతకు ముందు తెలీదు) అన్న పేర్లు పెట్టుకోవడం. ఇలాంటి అనుకరణల వల్ల మనకు సొంత అలోచనలు లేవేమో అనిపిస్తుంది.
మనవి మనకు ఉన్నప్పుడు విదేశీయులను అనుకరిస్తూ ఇలాంటి వాతలు పెట్టుకోవడం ఎందుకు? మనకు ప్రతిభలేదా లేక సొంతాలోచనలు లేవా?పేరు ప్రఖ్యాతలు వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళు ఫలాన విదేశీయులకి ఇండియన్ వెర్షన్ అనడం మనకే చెల్లింది.ఒకవైపు మన నగరాల పేర్లు చెన్నై అనీ, కొల్‌కత్తా అనీ మార్చేస్తూ ఉంటాం మరోవైపు విదేశీయులను అనుకరిస్తూ వాతలు పెట్టుకుంటూ ఉంటాం.
భాషకూ , ఇలాంటి ఆలోచనలకు సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఉదాహరణకి రేప్పొద్దున ఎవరైనా నేరేడుపండు లో (నేరేడుపండే ఎందుకు అంటే ఇప్పుడు రోజు అవే కనిపిస్తున్నాయి కాబట్టి) చెర్రీ పండు లో ఉన్న సుగుణాలు ఉన్నాయి అని కనిపెట్టారనుకోండి మనం వెంటనే నేరేడుపండుని “ఇండియన్ చెర్రీ” అని ప్రొజెక్ట్ చేస్తాం.కాలక్రమేణా నేరేడుపండు అన్న పదం మరుగున పడిపోయి ఇండియన్ చెర్రీ అన్నది వాడుకలోకి వస్తుంది. మన భాషలోకి వేరే పదాలు వస్తే ఆనందిచేలా మనం విశాలంగా ఆలోచించాలి అనేవాళ్ళు ఉన్నారు. మనది అన్నపదాన్ని వేరే పదం ఆక్రమిస్తుంటే ఎలా అంగీకరించగలం?
మనం ఈ వాతలు పెట్టుకోవడం ఎప్పటికి మానేస్తామో?
రేరాజ్ గారు చెప్తున్నట్లు మనదైన భాషలో ఆలోచించాలేమో!
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 4 వ్యాఖ్యానాలు »
Posted on మే 30, 2009 by స్నేహ
చెత్తకుండీ అనగానే నాకు భరించలేని కంపు, చుట్టూ తిరుగాడే పందులు ఇవే గుర్తుకు వస్తాయి.అలాంటి చెత్తకుండీ నవ్వడమేంటీ అనుకుంటున్నారా?
మేము చిన్నప్పుడు ఉన్న ఊరిలో ఇంటిలో చెత్తబుట్టలు, వీధిలో చెత్తకుండీలు వుండేవి కావు. ఇంటిలో తయారయ్యే చెత్త, ఎనుములు (గేదెలు), ఎద్దుల పేడ ఇవన్ని దిబ్బలో వేసేవాళ్ళు. పొలాల్లో పంటలు వేసేటపుడు దీనిని ఎరువుగా పొలాల్లో వేసేవాళ్ళు. ఆ వూరిని వదిలి కొంచెం పెద్ద పట్టణానికి వచ్చాక చెత్తబుట్టలు, చెత్తకుండీలతో పరిచయం ఏర్పడింది. చెత్తకుండీ నుండి వచ్చే కంపు చూస్తే చుట్టుపక్కల నివసించేవాళ్ళకు ఎంత ఇబ్బందిగా వుంటుందో అనిపించేది.
నాకు భూతాపం (గ్లోబల్ వార్మింగ్)గురించి తెలిసాకా ప్లాస్టిక్ కవర్లను వాడకపోవడంతో పాటు చెత్తను కూడా తగ్గించాలని నిర్ణయించుకున్నాను. చెత్తను తగ్గించే మార్గాలగురించి గూగిలిస్తే కంపొస్ట్ గురించి తెలిసింది. కంపోస్ట్ అంటే అదేదో కొత్తది కాదు నేను చిన్నప్పుడు చూసిన దిబ్బనే అని అర్థం అయ్యింది. కంపోస్ట్ తయారు చేయడం మొదలు పెట్టాక బయట పడేసే చెత్త బాగాతగ్గింది. కంపోస్ట్ చేయక ముందు ఇంట్లో వాసన వస్తుందేమో, పురుగులు వస్తాయేమో అన్న సందేహాలు ఉండేవి. కానీ చేయడం మొదలు పెట్టాక ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కంపొస్ట్ చేయడం కోసం ఎలాంటి కొత్త వస్తువులు కొనక్కర్లేదు.ఖాలీ పూలకుండీనో, పాత బక్కెట్నో వాడుకోవచ్చు.వంటింట్లోతయారయ్యే చెత్త అంటే కూరగాయల తొక్కలు, పండ తొక్కలు వీటిని వృథాగా బయట పడేయకుండా కంపోస్ట్ చేస్తే 2-3 నెలల్లో సారవంతమైన ఎరువు తయారవుతుంది. మొక్కలు పెంచుకునేవారు మొక్కలకు ఎరువుగా వాడవచ్చు, లేని వారు స్థానికంగా ఉన్న నర్సరీల్లో అమ్మవచ్చుకూడా.
ఇంట్లో స్థలం లేదు ఎక్కడ పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు, ఏమైన సమస్యలు వస్తే ఎలా అనుకునేవాళ్ళు ఇక్కడ చూడండి.ఆకర్షణీయంగా ఉండే కంపోస్ట్ బిన్ లను కొనవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైనపుడు వాళ్ళ సిబ్బంది వచ్చి సహాయం అందిస్తారు, మనం తయారుచేసే కంపోస్ట్‌ను తిరిగి కొంటారుకూడా.
ఎవరి ఇంటిలో వాళ్ళు చెత్తను వృథాగా పారేయడం తగ్గిస్తే పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రయత్నించి చూడండి. ఇనుము ముండి బంగారం తయారుచేసే ఆల్కెమిస్టుల్లాగా వృథాగా పారేసే చెత్త నుండి బంగారంలాంటి ఎరువును తయారు చేసుకోండి.
చెత్తకుండీ నుండి కంపును, భారాన్ని తగ్గించిన తరువాత చెత్తకుండీ నవ్వదంటారా?
: నందు ఉంచబడ్డది; సమాజం | Leave a Comment »
Posted on ఏప్రియల్ 5, 2009 by స్నేహ
ఈ మధ్య ఒకరి టపా లో మన నమ్మకాలు గుడ్డివి అన్న వాక్యం చదివాక కలిగిన ఆలోచనల ఫలితమే ఈ టపా. అసలు నమ్మకం అంటే ఏమిటి?ప్రతి మనిషి తన అనుభవాల వల్ల ప్రతి విషయం మీద నిశ్చిత అభిప్రాయాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది.వాటినే నిజమని నమ్మడం జరుగుతుంది.మనం నమ్మిన ప్రతి విషయం సత్యం, నమ్మని విషయం అసత్యం అవ్వవు కదా.అందరు మనుషుల అనుభవాలు ఒకేలా ఉండనట్టే అందరి నమ్మకాలు ఒకేలా ఉండకపోవచ్చు.నా నమ్మకం, ఎదుటి మనిషి నమ్మకం ఒకటి కానంత మాత్రాన నీది గుడ్డి నమ్మకం అనడానికి నాకేం అధికారం ఉంది?
హేతువాదులు అనేవాళ్ళ నమ్మకం దేవుడు లేడని.వీళ్ళు ఇలాంటి నమ్మకంతో జీవిస్తున్నపుడు దేవుడిని నమ్మేవాళ్ళది గుడ్డి నమ్మకం అని ఎలా అనగలరు?ఒక నమ్మకం ఎక్కువ ఒక నమ్మకం తక్కువ ఎలా అవుతాయి?దేవుడి నమ్మే వాళ్ళకు వీళ్ళు వేసే ప్రశ్న దేవుడున్నాడని నిరూపించమని. దేవుడున్నాడన్నది నా నమ్మకం అయినపుడు, నిరూపణలతో పని లేకుండా నేను నమ్ముతున్నపుడు, నిరూపించాల్సిన అవసరం నాకేమిటి? దేవుడున్నాడు అన్న నా నమ్మకం ఇతరుల నమ్మకాలకు, ఇతరుల జీవితాలకు ఎలాంటి హాని కలిగించనపుడు నా నమ్మకాన్ని మార్చాలన్న ప్రయత్నం ఎందుకు?
ఈ మధ్య ఎక్కడో చదివాను ఆయుర్వేదాన్ని నిరూపిస్తే ఎంతో బహుమతి ఇస్తారని. ఆయుర్వేదాన్ని నమ్మేవాళ్ళు ఇలాంటి నిరూపణలతో పని లేకుండా నమ్ముతూనే ఉంటారు.అసలు ఆయుర్వేదం తప్పు అని కొట్టిపారేయకుండా అందులో ఎదైనా మంచి ఉందేమో అని నిజాయితీగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది కొంచెమయినా ఉపయోగపడవచ్చు కదా.
ఇప్పటి వరకు లెక్కలేనన్ని సార్లు విమర్శలకు గురి అయినది రాముడు అంటే అతిశయోక్తి కాకపోవచ్చు.రాముడిని, రామాయణాన్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటారో నమ్మని వాళ్ళు అంతే మంది ఉండొచ్చు. మరి ఒక నమ్మకం “కళ్ళున్నది”, ఒక నమ్మకం “గుడ్డిది” ఎలా అవుతుంది. రామాయణం జరిగిందా లేదా అన్న వృథా చర్చల కంటే రామాయణంలో ఉన్న ఆచరణయోగ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం.అందులో తెలుసు కోవాల్సిన విషయాలు ఏమి లేకపోతే రామాయణాన్ని పక్కన పెట్టి దాని జోలికి వెళ్ళకుండా ఉండడం మేలు.ఇతరుల నమ్మకం మనకు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఎలాంటి నష్టం కలిగించనపుడు వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు ప్రశ్నించడం?
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 6 వ్యాఖ్యానాలు »
Posted on ఏప్రియల్ 1, 2009 by స్నేహ
చిన్న వయసు పిల్లలు ఉన్న చాలా ఇళ్ళలో ఆటబొమ్మలు పంచుకోవడం దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్నపాటి యుద్దం జరుగుతూవుంటుంది. మా అబ్బాయి పుట్టినపుడు అందరు తల్లిదండ్రులలాగే మావాడు మేము చెప్పినట్లు వినాలని, ఇంటికి వచ్చిన పిల్లలు ఎవరైనా వాడి బొమ్మలు అడగగానే మారు మాట్లాడకుండా ఇచ్చేయ్యాలని ఇలాంటి కలలు చాలానే ఉండేవి.పిల్లల మనస్తత్వాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాక నా కలలు నిజం కావాలంటే నేను చెప్పినట్టు నడుచుకునే రోబోట్ తెచ్చుకోవాలని అర్థం అయ్యింది.
అందరు పిల్లలూ ఒకేలాగా ఉండరు. అందరికి తమ వద్ద ఉన్న వాటికి ఇతరులతో పంచుకోవడం అనేది సహజంగా వచ్చే లక్షణం కాదు.పిల్లల వరకు ఎందుకు మనలోనే చాలా మందికి మనకు నచ్చిన వాటిని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడం. కొందరికి పుస్తకాలు ఇవ్వడం నచ్చకపోవచ్చు, ఇంకొందరికి నగలు ఇవ్వడం నచ్చకపోవచ్చు ఇలాంటివి చాలానే ఉండొచ్చు. మరి అలాంటపుడు మన పిల్లల్ని మాత్రం ఇవ్వమని ఎందుకు బలవంతం చేయాలి?
ఈ విషయం అర్థం చేసుకోకముందు నేను కూడా ఇంటికి ఎవరైనా పిల్లలు రాగానే వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వాలి అని మా బాబుకి చెప్పేదాన్ని.నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్న తరువాత ఎప్పుడూ బలవంతం చేయలేదు.ఇప్పుడు మా ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఒకే నియమం ఎవరికి సంబంధించిన వస్తువు మీద సర్వాధికారం వాళ్ళదే.ఇతరులకు అవసరం వచ్చినపుడు వాళ్ళను అడిగి, వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు.
మా బాబు స్నేహితులు ఎవరైనా ఆడుకోవడానికి వచ్చినపుడు వాడి బొమ్మలు పంచుకొని ఆడుకోవడం వాడి ఇష్టానికే వదిలిపెట్టేసాం. ఇలా చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ఎలాంటి యుద్దాలు లేవు.
: నందు ఉంచబడ్డది; నేను-మా పిల్లలు | 3 వ్యాఖ్యానాలు »
Posted on ఫిబ్రవరి 7, 2009 by స్నేహ
అన్నింటిలోనూ కొత్త పద్దతులు వస్తున్నట్టే పిల్లల పెంపకంలో కూడా కొన్ని కొత్త పోకడలు కనిపిస్తున్నాయి.కొన్నింటిని చూస్తే మరీ వింతగా అనిపిస్తుంది.ఈ మధ్య కొంతమంది చదువుకున్న తల్లిదండ్రులకు వాళ్ళ అబ్బాయిలు తుపాకీలతో ఆడుకోవడాన్ని ఇష్టపడడంలేదు. వీరి ఉద్దేశం మంచిదే కానీ మరీ 4-5 సంవత్సరాల వయసు పిల్లలకు తుపాకీ ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలీదు. మరి అలాంటపుడు మనమే తుపాకీ విధ్వంసానికే ఉపయోగిస్తారు అని తెలిసేలా చేయడం ఎందుకు?
ఇంక అమ్మాయిలు ఉన్నవాళ్ళు బార్బీ లాంటి బొమ్మలతో వాళ్ళ పిల్లలు ఆడుకోవడాన్ని ఇష్టపడడం లేదు.ఎందుకంటే పెద్ద అయిన తరువాత వాళ్ళ పిల్లలు బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని.వీరి ఉద్దేశం అర్థం చేసుకోదగినదే.కానీ నాకు అర్థం కాని విషయం పిల్లలకు ఆదర్శం తల్లిదండ్రులా లేక బొమ్మలా?
ఇంక కొందరు పిల్లలు మాటలు మొదలు పెట్టగానే థాంక్యూ, సారీ లాంటివి నేర్పిస్తూ ఉంటారు.కృతఙ్ఞతలు చెప్పడం, క్షమాపణలు చెప్పడం ఇవన్నీ మనలో కలిగే భావాలను మాటల్లో చెప్పడం కదా.మరి ఆ మాటలకు అర్థాలే తెలియని పిల్లల చేత ఇవన్ని చెప్పించడం ఏమిటి?ఆ భావాలను సంపూర్ణంగా అనుభవించినపుడే కదా వాళ్ళు మాటల రూపంలో వ్యక్తపరిచేది.ఆ పదాల అర్థాలు, వాటిని ఎప్పుడు ఉపయోగించాలో చెప్పకుండా పిల్లల చేత బలవంతంగా చెప్పించడం ఎందుకు?
మొత్తానికి తల్లిదండ్రులలో విఙ్ఞానం పెరుగుతున్న కొద్దీ పిల్లలను తమకు నచ్చినట్టు పెంచాలనే ధొరణి ఎక్కువౌతోన్నట్టు కనిపిస్తోంది. పిల్లలను పెంచడం కూడా ఒక పని లాగా మన ఇష్టం వచ్చినట్టు చెయ్యాలా?లేక పిల్లలూ ప్రాణమున్న మనుషులే వాళ్ళకూ కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెరగడానికి మనం సహాయపడాలా?
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 7 వ్యాఖ్యానాలు »
Posted on ఫిబ్రవరి 5, 2009 by స్నేహ
గత కొద్దిరోజులుగా బ్లాగ్లోకంలో మహిళాబ్లాగర్లపై జరుగుతున్న దాడులను గమనించారా?ఎన్ని బ్లాగులు మూతపడ్డాయో చూస్తున్నారా?మనం స్పందించకపోతే పరోక్షంగా సమర్థించినట్టే. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకు స్పందించే మనం మన కళ్ళ ముందర జరిగే నేరాలను చూస్తూ వుండడం ఏమిటి?ఈ బ్లాగు చదువరులకు ఒక విఙ్ఞప్తి ఈ దాడులను ఖండించండి. దాడులకు గురైన బ్లాగర్లకు మనందరం తోడున్నామని తెలియచేద్దాం.
సైబర్ దాడుల మీద నా టపాలు ఇక్కడ ఇక్కడ చదవండి.
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | Leave a Comment »
Posted on ఫిబ్రవరి 5, 2009 by స్నేహ
నిన్నటి టపాలో సైబర్ దాడిని ఎదుర్కొన్న మహిళ గురించి రాసాను. ఆ పరిస్థితి మనవరకు వచ్చిందనుకోండి ఏమి చేయాలో తెలుసుకోవాలి కదా.సైబర్ దాడికి గురైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దాడులు మీతోనే మొదలుకాలేదు మీతో అంతం కావు.పెట్టుడు పేర్ల ముసుగులో అసభ్యంగా రాసే కుసంస్కారులు వున్నంతకాలం ఇది కొనసాగుతుంది.దాడికి గురవ్వడం మన తప్పు కాదు. దీన్నించి మనల్ని మనం రక్షించుకోవడం తెలుసుకోవాలి.
మీకు తెలుసా సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్ ఎబ్యూస్ అన్నవి ఎక్కువగా మహిళలు, పిల్లల మీద జరుగుతాయని.అమెరికాలో వీటిని చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. మన దేశంలో కూడా వీటిని నేరాలుగానే పరిగణిస్తున్నారు.ఇంకా వివరాలు కావాలంటే ఈ లాయర్ గారిని అడగండి.ఈవిడ సైబర్ నేరాల మీద పనిచేస్తున్నారు.చట్టాలు కూడా మనకి రక్షణగా వున్నాయి.దాడికి గురైన వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మన కోసం ఎవరు ముందుకు వచ్చినా ,రాకపోయినా, మనల్ని మనం రక్షించుకోవాలి. దాడులు జరిగినప్పుడు మాట్లాడకుండా ఉంటే దాడులు ఆగవు. దాడులు చేసే వాళ్ళకు మరింత అవకాశం ఇచ్చినట్టవుతుంది.
మనతోటి వాళ్ళు దాడికి గురయ్యారనుకోండి అందరం దాన్ని తీవ్రంగా ఖండిద్దాం.మనకెందుకులే అని పట్టనట్టు ఉంటే ఆ దాడులు మనవరకు రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
: నందు ఉంచబడ్డది; నా ఆలోచనలు | 1 అభిప్రాయం »